Wednesday, March 10, 2010

కలర్ లో మాయాబజార్ ! ఒక అభిమాని మోదం...ఖేదం!

నేనొక సీనియర్ సిటిజన్ ని. అంటే, మాయాబజార్ 1957 లో మొదటి సారి విడుదల చేసినప్పుడు చూసి, ఇంకా భూమ్మీద ఉన్న వాళ్ళలో నేనూ ఒకణ్ని.ఎనిమిదేళ్ళవయసులో విజయవాడ లో ఆ రోజుల్లో మా ఇంటికి కాంపౌండు గోడ మీద ప్రతి శుక్రవారం మాయాబజార్ వాల్ పోస్టర్ అతికించే వారు.ప్రతి శుక్రవారం పొద్దున్నే లేచిపోయి ఆత్రం గా గోడ దగ్గరికి పరిగెత్తే వాళ్ళం.ఆ రోజుల్లో సినిమా పబ్లిసిటీ కి వాల్ పోస్టర్ లే ఆధారం.నాకు బాగా గుర్తు...ఒకవారం చిత్రం లోని నౌకా విహారం దృశ్యం ని పోస్టర్ వేస్తే,మరో వారం
కృష్ణుడు ఘటోత్కచుడికి చెవిలో (చెయ్యవలసిన పని) ఉపదేశించే దృశ్యం... అలా అలా మా ఇంటి ముందు ప్రతి వారం వాల్ పోస్టర్లు కన్నుల పండుగ చేసేవి. ఇక ఆదివారాలు, స్కూల్ కి సెలవులు వస్తే, పిల్లల గాంగ్ అందరం చెట్ల కింద చేరి మాయాబజార్ ఆట ఆడుకునే వాళ్ళం. కొబ్బరి ఈనెల తోను, చీపురు పుల్లల తోను బాణాలు చేసి యుద్ధాలు చేసే వాళ్ళం. ప్రస్తుతం అమెరికా లో ఉంటున్న నా మేనకోడలు ఆమధ్య వచ్చినప్పుడు ఆ ఆటలన్నీ గుర్తుచేసుకుని సంతోషం గా నవ్వుకున్నాము. కాలం గడిచేకొద్దీ బంగారం విలువ పెరుగుతూ పోతున్నట్టే,మాయాబజార్ విలువ కూడా పెరుగుతూ వస్తోందే కాని ఎప్పటికీ తరగదు అని చెప్పటానికే ఇదంతా రాయటం.బాల్యం నుంచి ఇప్పటివరకు ఓ ముఫ్ఫైసార్లు చూసినా,చూసిన ప్రతిసారీ అంతకుముందు నాకు తెలియని ఏదో కొత్త విషయం, లేదా నాదృష్టికి రాని ఓ కొత్త కోణం కనబడుతూ వస్తోంది. నావరకు నాకు (ఇప్పటికీ) మాయాబజార్ చూడటం..మాయాబజార్ గురించి ఆలోచించటం..మాయాబజార్ గురించి మాట్లాడటం..మాయాబజార్ గురించి చదవటం ఓ ఎడ్యుకేషన్! మాయాబజార్ కి ముందు సినీ పరిశ్రమలో,పౌరాణిక చిత్రాలని భారత, భాగవత,రామాయణ గ్రంధాలనుంచి తీసుకున్న కధలని మక్కికి మక్కీ గానే తీస్తూ వచ్చారు.కాని, మైథాలజీ లోంచి ఫిక్షన్ ని సృష్టించి, చిత్రాన్ని నిర్మించి విజయం సాధించటం అనేది విజయా వారికే చెల్లింది! అలా అని మాయాబజార్ రచన పూర్తిగా పింగళి వారి స్వకపోలకల్పితం అని చెప్పటానికి లేదు.కొన్ని దశాబ్దాల కిందట కర్నాటక లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో "శశి రేఖాపరిణయ" పేరుతొ, గుబ్బివీరన్న నాటక సమాజం వారు నాటకం,యక్షగానం ఆడేవారు.కాకపొతే...భారత కధ లోని ముఖ్యమైన పాత్రల్లో కొన్నిటినే తీసుకుని, ఆయా పాత్రల ఔచిత్యం చెడకుండా...పైగా మరింతా పెరిగేలా చేసి ఆద్యంతం ఉత్కంట భరితం గా కధనాన్ని జవనాశ్వంలా నడిపారు శ్రీ పింగళి నాగేంద్ర రావు,శ్రీ కే.వి.రెడ్డి ద్వయం.(కాకపొతే, ఒకే ఒక్క పాత్ర.. శశిరేఖ.. మాత్రం కల్పితం.)
మాయాబజారు నిర్మాణం లో ఉన్న సమయం లోనే దేశం లో కలర్ చిత్రాలు అడపాదడపా విడుదల అవుతూ ఉండేవి. కాకపొతే షూటింగ్ పూర్తయ్యాక వాటిని కలర్ ప్రాసెసింగ్ కోసం లండన్ వెళ్లి ప్రింట్ చేసే వారు.అవన్నీ "టెక్ని కలర్" చిత్రాలని చెప్పేవారు.కాని ఎక్కువగా భారీ చిత్రాలు తీసే హిందీ చిత్ర నిర్మాతలే వర్ణ చిత్రాలు తీసేవారు. మహబూబ్ ఖాన్ తీసిన మదర్ ఇండియా,సన్ అఫ్ ఇండియా, వి .శాంతారాం తీసిన ఝనక్ ఝనక్ పాయల్ బాజే, నవరంగ్ వగైరాలన్నీ టెక్నికలర్ లో తీసారు. దక్షిణ భారత సినీ పరిశ్రమలో వచ్చిన ఏకైక టెక్నికలర్ చిత్రం "కొంజుం సలంగై." . తెలుగు లో "మురిపించే మువ్వలు" గా డబ్ చేసారు.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఆసియా లోనే అతిపెద్ద స్టూడియో (విజయా-వాహిని) అధినేతలు,మాయాబజార్ నిర్మాతలైన నాగిరెడ్డి, చక్రపాణిలు, మార్కస్ బార్ ట్లే లాంటి కెమెరా మాంత్రికుడు తలుచుకుంటే, కాదు కాదు పెద్దమనసు చేసుకుని ఉంటే, వాళ్లకి మాయాబజార్ ని టెక్నికలర్ లో తీయటం ఏమాత్రం కష్టం కాదు.అలా జరిగుంటే..ఈనాడు మాయాబజార్ లాంటి అత్యుత్తమ కళాఖండం ఈనాడు కలర్ లో మనంచూస్తున్న విధం గా కాక, ఏ విధమైన ఎడిటింగ్ లు,కటింగ్ లు లేకుండా ఉన్నది ఉన్నట్టు గా యాభయ్యేళ్ళ తర్వాత కూడా తరతరాల ప్రేక్షకులకి కన్నులపండుగ..వీనులవిందు చేసేది.
(మాయాబజార్ పూర్తి చేసిన తరువాత కొద్ది కాలానికే మార్కస్ బార్ ట్లే కలర్ చిత్రం "చెమ్మీన్" (మలయాళం) కు చాయాగ్రహణం చేసారు. తర్వాత విజయ సంస్థ కే హిందీ లో రామ్ ఆర్ శ్యాం,తదితర చిత్రాలు చేసారు.మార్కస్ బార్ ట్లే చాయాగ్రహణం చేసిన ఆఖరి చిత్రం "శ్రీ కృష్ణ సత్య"కూడా వర్ణ చిత్రమే!) ఆ తర్వాత అనతికాలం లోనే బొంబాయి లో ఫిలిం సెంటర్ స్టూడియో దేశంలో మొదటి కలర్ ప్రాసెసింగ్ లేబొరేటరీ ప్రారంభించిన క్రమం లో మద్రాస్ లో జెమిని వారి లేబరేటరీ కూడా మొదలయ్యేసరికి దేశం లో వర్ణచిత్రాల నిర్మాణం జోరు పెరిగిపోయింది.
దాంతో ఇక విజయ-వాహిని సంస్థ కూడా కలర్ చిత్ర నిర్మాణం లోకి దిగినా,హిందీ లో చెత్త చిత్రాలు తీసి చేతులు కాల్చుకోటమే కాకుండా, సంస్థ ప్రతిష్ట ని కూడా దిగజార్చుకుంది. మాయాబజార్ విషయం లో కూడా విజయ సంస్థ కి ఓ అపప్రధ ఉన్నదని కర్ణాకర్ణి గా నాకు తెలిసింది. అదేమిటంటే, మాయాబజారు నిర్మాణం మొదలయ్యాక, చిత్రం కి అయ్యే బడ్జెట్ విషయమై నిర్మాతలకి, దర్శకుడు కే.వి.రెడ్డి కీ మధ్య మనస్పర్ధలు వచ్చాయని.. ఒక దశలో చిత్రం ఆగిపో యెంత వరకు వచ్చిందని విన్నాను. తర్వాత తెలుగు ప్రేక్షకుల అదృష్టం బాగుండి మాయాబజార్ మన కళ్ళ ముందు నిలిచింది.

nostalgia లోంచి ఊడిపడి వర్తమానం లోకి వస్తే....
మాయాబజార్ ని శతసహస్ర వర్ణ రంజితం చేసే నిర్ణయం తీసుకోవటం లో "జాప్యాలస్యం" జరిగినా, అందుకు పూనుకున్న "గోల్డ్ స్టోన్"వారి కృషి సామాన్యమైనదేమీకాదు.అందుకు వాళ్లకి "వందన నమస్కారంలు" చెయ్యక తప్పదు. వారి చిత్తశుద్ధినీ, నిజాయితీని,మాయాబజార్ మీద వాళ్లకి ఉన్న ప్రేమ ని శంకించాల్సినపనిలేదు. వాళ్ళు ఎంత ఆరాధనతో,అంకితభావం తో పనిచేసారో టీవీ చానెల్స్ లో వచ్చిన, "ప్రోమోస్" చూస్తేనే మనకి అర్ధం అవుతుంది.వాళ్ళూ పడిన శ్రమ వృధా కాలేదు.కాని, శిధిలావస్తలో ఉన్న చిత్రం నెగెటివ్ ని చిత్రిక పట్టే క్రమం లో పడరాని పాట్లు పడటం ,చిత్రానికి ప్రాణమైన నేపధ్య సంగీతాన్ని ఉన్నదున్నట్టు గా సౌండ్ ట్రాక్ లో కి తీసుకు రావటం లో విఫలమైన కారణం గా, కత్తిరింపు లకు గురై చిత్రం ని కుదించాల్సిన నిస్సహాయపరిస్తితిలో కూడా భగీరధ ప్రయత్నం చేసి కంటిన్యుటీ లో ఏమాత్రం పట్టు సడలనీకుండా మాయాబజార్ ని మనముందుంచారు!Hats off ! to Gold Stone co. అని చెప్పక తప్పదు.
కాకపొతే...నేను ముందే చెప్పానుకదా...పాత తరం వాడిగా నేను వర్ణ చిత్రం గా పునర్జన్మ పొందిన చిత్రం ని చూసి ఎంత ఆనందించానో, అంత ఖేదపడ్డాను.
క్లుప్తం గా, స్పష్టం గా చెప్పాలంటే...కలర్ మాయాబజారు, బ్లాక్ అండ్ వైట్ మాయాబజార్ విలువని మరింత పెంచింది.చిత్రం లోని కొన్ని దృశ్యాల,పాటల,సంభాషణల తీసివేత అలా ఉంచి, ముందు ఇతరత్రా చేసిన రిపేర్లు గురించి ఇక్కడ ప్రస్తావిస్తాను.
అ)విజయ వారి లోగో తెరమీద పడగానే వచ్చే సిగ్నేచర్ ట్యూన్, టైటిల్స్ తెర పై వస్తున్నప్పుడు వచ్చే నేపధ్య సంగీతం..ఈ రెండూ పాతవి చెరిపేసి, తిరిగి ఆర్కెస్ట్రా తో మళ్ళీ రికార్డ్ చేసి జోడించారు.ఎంతైనా ఒరిజినల్,ఒరిజినలే కదా!ఈ రీమిక్స్ లు రెండూ పేలవం గానే వినిపించాయి.
ఆ)ప్రియదర్శినిలో బలరామునికి దుర్యోధనుడు కనపడినప్పుడు సడన్ గా విన వచ్చే ఆర్కెస్ట్రా హోరు దృశ్యం,సందర్భంలో దుర్యోధనుడి రాజసాన్ని, పదిరెట్లు పెంచేది గా ఉంటుంది.అది కూడా చెరిపేసి తిరిగి పేలవంగా రికార్డు చేసి జోడించబడింది.
క) చిత్రం ని సినిమాస్కోప్ లోకి మార్చటం వలన కనిపించే దృశ్యం జూమ్ అయి,స్పష్టత వచ్చిందే కాని, దృశ్యాలలో కింది భాగాలలో కనపడే కొన్ని ప్రాపర్టీస్ మాయం అవటం మనం స్పష్టం గా చూస్తాం.ఉదాహరణకు..ఘటోత్కచ,అభిమన్యుల యుద్ధప్రారంభంలో ఘటోత్కచుడు పర్వతాగ్రం పైకి దూకి నిలబడగానే, ఆ వేగానికి ఒక పెద్ద కొండ రాయి విరిగిపడుతుంది.అంతే!ఆ సీన్ కి ఏభై ఏళ్ళ పాటు ధియేటర్ లన్నీ చప్పట్లతో,ఈలలతో దద్దరిల్లాయి!అవును మరి...ఘటోత్కచుడి బలపరాక్రమాలని కేవలం ఒకే ఒక షాట్ లో చూపించిన కే.వి.రెడ్డి,లేక మార్కస్ బార్ట్లే, లేదా ఇద్దరి ప్రతిభ అది.మరి...ప్రస్తుతం రాయి విరిగి పడటం మనకు కనిపించదు. సినిమాస్కోపు మింగేసింది.తర్వాత,శర్మ-శాస్త్రి ద్వయాన్ని ముప్పుతిప్పలు పెట్టే గింబళీ దృశ్యం లో చేయి పడినప్పుడల్లా దూరంగా జరిగిపోయి ఏడిపించుకుతినే తమలపాకుల పళ్ళెం మనకు కనిపించదు.పిల్లలు కుర్చీల్లోంచి లేచిపోయి చప్పట్లు కొడుతూ నవ్వే సన్నివేశం అది.ఇలా సినిమాస్కోపు కొలతలు మింగేసి, మనని విలవిల లాడించే దృశ్యాలు అనేకం.
ఇక దృశ్యపరంగా, సంగీత పరంగా, సంభాషణల పరంగా తీసివేత కి గురైన భాగాలని గురించి చెప్పాలంటే...
అ) దారుకుని పాట "భళి భళి భళి భళి దేవా..." పూర్తిగా తొలగించారు.
ఆ)మోహిని భస్మాసుర నృత్య రూపకం పూర్తిగా తొలగించారు.
ఈ)లల్లిలలా పాట(శశి రేఖ పెద్దదైనపుడు)ని సగం తొలగించారు.
ఉ)పెళ్ళిపెద్దల పాట "దయచేయండి,దయచేయండి,"ని ముప్పాతిక భాగం తొలగించారు.
ఏ)ఘటోత్కచుని పద్యాలు, "దురహంకార మదాంధులై", "స్వాతిశయమున త్రుళ్ళు"...ఈ రెంటినీ తొలగించారు.
ఐ)సి.ఎస్.ఆర్ తన సొంత గొంతు తో పాడిన అరుదైన లఘు గీతం(కూనిరాగం అందామా?)"శకుని ఉన్న చాలు..శని ఏల అని కదా!..అవును..నిజమే.. నేను, అంత ఘనుడ!కాని పనుల నైన, కాజేసుకొని గాని, మానిపోవలేనే...మాయలాడి!"ఈ లఘు గీతాన్ని శ్రీ సీయస్సార్ గమకాల్తోను,సంగతుల తోను భేషుగ్గా పాడి వినిపించారు!(పూర్వాశ్రమం లోచిత్రాల్లో తన పాటలు తనే పాడుకున్న గాయకనటుడు కదా మరి!).
ఇది కూడా తొలగించారు.
ఓ)శ్రీకరులు దేవతలు పాటలో కృష్ణుడు,రుక్మిణి ఆశీర్వదించే చరణం ని తొలగించారు.
క)సాత్యకి, బలరామ క్రిష్ణులకి చిత్రపటంచూపుతూ రాజసూయాన్ని, మయసభని, వర్ణిస్తూ చెప్పే సంభాషణలు తొలగించారు.
ఖ)ఘటోత్కచుని ఆశ్రమంలో చిన్నమయ్య శిక్షణ, లంబు-జంబు ల అల్లరి సగభాగం తొలగించారు.
గ)దుఖం లో ఉన్న శశిరేఖకోపం తో చెలికత్తె చెంప పగలకొట్టే దృశ్యం...అదృశ్యం!
ఘ)ఇంటర్వల్ తర్వాత వచ్చే హాస్య సన్నివేశం...లక్ష్మణ కుమారుని తో శర్మ-శాస్త్రి,సారధి లు చేయించే పెళ్లి రిహార్సల్ సీను-"వివాహ కార్యక్రమం లో అతి ముఖ్యమైన చిట్టచివరి క్రియ ఇది."అని శర్మ-శాస్త్రి చెప్పబోతుంటే," అంటే అంత్యక్రియలు."అనిలక్ష్మణ కుమారుడు పూర్తి చేస్తాడు. డైలాగు పరం గా పేలే ఈ హాస్య సన్నివేశం కూడా తొలగించారు.
జ)ఘటోత్కచుడు ద్వారక లో ప్రవేశించే దృశ్యం..అగ్గిపెట్టెల్లాంటి ఇళ్ళ మధ్య జాగ్రత్తగా అడుగులు వేస్తూ నడిచే ట్రిక్ షాట్,చిన్నమయ్య, విడిది నగరం నిర్మించ బోయేముందు లంబు-జంబులకు ప్లాన్ (పతకం)చూపించటం,అక్కడి సంభాషణలు తొలగించారు.
కంప్యూటర్ టెక్నాలజీ ఏ మాత్రం తెలీని నాలాంటి చాలామందికి అర్ధం కాని విషయం ఒకటుంది. చిత్రం నెగెటివ్ శిధిలావస్థ లో ఉండటం చేత చిత్రం లో కొంత భాగం తీసివేతకి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ రీమిక్స్ చేయటం అనివార్య మైనదని గోల్డ్ స్టోన్ నిర్వాహకులు చెప్పటం జరిగింది. అదే నిజమైతే, కంప్యూటర్ యుగంలో చిత్రాలు సీడీలు, డీవీడీలు గా మారి టీవీ చానేల్సులోను, ఇళ్ళలోను,జనం చూస్తున్నారు.తెలుగు వాళ్ళ పండుగ రోజుల్లో ఏదో ఒక తెలుగు చానల్ నుంచి ప్రతి ఏడాది లో కొన్ని సార్లు మాయాబజార్ చిత్రం చక్కని క్వాలిటీ లో స్పష్టమైన ఆడియోతో తో ఎలాంటి కోతలు,తీసివేతలూ లేకుండా టెలికాస్ట్ చేయబడుతున్నది. డీవీడీలు చిత్రం ప్రింట్ నుంచి కాక నెగెటివ్ నుంచే తీస్తారని విన్నాను. విడియో ప్రభంజనం వలన ఇదివరకంత తరచుగా కాకపోయినా, ఇటీవలి కాలం వరకూ(అంటే కలర్ లో రిలీజ్ కాక ముందు) అప్పుడప్పుడూ దియేటర్ లలో ప్రదర్శిస్తున్న తెలుపునలుపుల చిత్రం కూడా కట్స్ లేకుండానే క్వాలిటీ ఉన్న ప్రింట్ లలోనే ప్రదర్శింప బడింది. మరి ఆ ప్రింట్ లు ఏభై ఏళ్ళ కిందటివి కావని,కొద్ది సం.ల కిందనే రీప్రింట్ చేయబడినవని చూసినవాళ్ళకి స్పష్టం గా తెలుస్తుంది. మరి నెగెటివ్ పాడయితే,ఇది ఎలా సాధ్యం?
ఇక వర్ణ చిత్రం లో నాకు నచ్చిన అంశాలలో మొదటిది..యాభై ఏళ్ళ క్రితం సావిత్రి మహోన్నత సౌందర్యం, అనితర సాధ్యమైన అభినయం ని కలర్ లో చూడ గలగటం. తర్వాత నటీనటుల దుస్తులు, ఆభరణాలు, గోఖలే-కళాధర్ ల సృష్టి లో ధగధ్ధగాయ మానం గా వెలిగిపోయిన భారీ సెట్టింగ్ లు, మార్కస్ బార్ ట్లేచాయాగ్రహణం.
చివరాఖరిగా నేను చెప్పేదొకటే. మనకి మాయాబజార్ సంపూర్ణం గా కలర్ లో చూడ లేక పొతే ఆ తప్పు గోల్డ్ స్టోన్ యాజమాన్యం ది కానే కాదు. తెలుగు సినీ చరిత్ర లోనే అత్యుత్తమ కళాఖండం గా నిలిచిన చిత్రం నెగెటివ్ ని కాపాడలేని విజయ-వాహిని సంస్థ నిర్వాహకులది, వారి వారసులదీను. అంతేకాదు. మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ సిగ్గుతో తలవంచు కోవాల్సిన సమయం ఇది.





Thursday, February 11, 2010

మొదటి కధ : ది పెయింటర్:(మాడు పగలకొట్టే ౩ కధల్లో, మొదటిది.)

అతడొక ప్రఖ్యాత చిత్రకారుడు. పేరు చంద్ర వర్మ.
బాల్యం నుంచే చిత్రకళలో అద్భుతమైన నైపుణ్యం కనపర్చేవాడు. కాన్వాస్ మీద అతడు వేసిన చిత్రాలు చూసి, ఎంతోఅనుభవం ఉన్న చిత్రకారులే ఆశ్చర్య పోయేవారు.అసూయ పడేవారు కూడా.
అతడి పేరు ప్రఖ్యాతులు ఆ దేశపు రాజు గారిక్కూడా తెలిశాయి.వెంటనే ఆ చిత్రకారున్ని తన ఆస్థానానికి పిలిపించాడు."నీ గురించి విన్నాను.చిత్రాలు వేయటం లో నీ ప్రతిభ, సామర్ధ్యం గురించి తెలుసుకున్నాను.ఎంతటి అసాధ్యమైన చిత్రాన్ని అయినా అలవోకగా,అవలీలగా,అత్యద్భుతం గా కాన్వాస్ మీద సృష్టించగల వన్న నమ్మకం తో నీకొక పని అప్పచేపుతున్నాను. నువ్వు నాకు ఒక చిత్రం ని వేసి పెట్టాలి. అది నీవల్లే సాధ్యం అవుతుంది."
"అలాగే మహారాజా! ప్రయత్నిస్తాను."వినయం గా అన్నాడు చంద్ర వర్మ.
"చెప్పండి.నేను వేయాల్సింది తమరి చిత్రమేనా?"
"కాదు."రాజు చెప్పాడు."నువ్వు భగవంతుడి చిత్రాన్ని వెయ్యాలి."
"ఏమిటి మీరు అడుగుతున్నది?"ఆశ్చర్యం తో నోరు తెరిచాడు చంద్రవర్మ.
"నువ్వు సరిగ్గానే విన్నావు."రాజు చెప్పాడు."నువ్వు దేవుడి చిత్రపటాన్ని వేసి నాకు చూపించాలి."
"కాని...ఇదెలా సాధ్యం మహారాజా?"
"అది నాకు తెలీదు ఎందుకంటే, నేను చిత్రకారుడిని కాను.నువ్వు ఇంతవరకు చిత్రాలు ఎలా వేస్తూ వచ్చావో,అలాగే ఇదీను."
"కాని,మహారాజా, నేను చిత్రాలు వేసేందుకు నా చుట్టూ ఉన్న మనుషులలో నించే నాకు పనికొస్తారనుకున్నవారిని ఎంచుకుని వారి శరీరాకృతి, ముఖ కవళికల నించి స్ఫూర్తి పొంది చిత్రాలు వేస్తున్నాను."
"మరింకేం?నీకు కోరినంత ధనం ఇస్తాను.కావాల్సినంత సమయం తీసుకో.నీ ఇష్టం. దేశం అంతా తిరిగి అన్వేషించు.దేవుడి చిత్రపటం ని తయారు చేయటానికి నీకు స్ఫూర్తి నివ్వ గల మనిషిని వెతికి పట్టుకో. ఎక్కడో ఉండే ఉంటాడు.ఆ రూపానికి నీ సృజనాత్మకతని, జోడించి ..కాన్వాస్ మీద కుంచె తో భగవంతుడి రూపాన్ని ఆవిష్కరించు.నీకు ఆ సర్వేశ్వరుడే సాయం చేస్తాడు.వెళ్ళు.పని మొదలు పెట్టు. ఇది నా ఆజ్ఞా."అంటూ చిత్రకారుడిని శాసించాడు రాజు.
చిత్రకారుడు అన్వేషణ మొదలు పెట్టాడు. ముందుగా దేవుడి స్వరూప స్వభావాల గురించి తనదంటూ ఒక అభిప్రాయం ఏర్పరచుకోవటానికి వేదాలు చదివాడు. పురాణ గ్రంధాలు,ఉపనిషత్తులు ...వేటినీ వదల్లేదు.దేవాలయాలన్నీ తిరిగి దేవతా మూర్తుల విగ్రహాలని, మూల విరాట్టు లని సందర్శించాడు. ఆ విధం గా జ్ఞాన సంపద పెరుగుతున్న కొద్దీ, అతని లో అశాంతి ఎక్కువ అవసాగింది. మనసులో శూన్యత పేరుకో సాగింది.ఒక దశలో నిరాకారుడు,నిర్వికల్పుడూ , సర్వాంతర్యామి అయిన భగవంతుడిని సాకారుడిగా కాన్వాసు మీద కుంచెతో నిలబెట్టటం అనేది ఇక తన వల్ల కాదేమో అని మధన పడ సాగాడు.
దేవుడి గురించి తను చదివి తెలుసుకున్నదంతా ఒక అవ్యక్త మైన అప్రకటితమైన,అస్పష్టమైన స్వరూపాన్నే ఇస్తోంది.
ఇప్పుడు తనకి తన మెదడు లో నిక్షిప్తమైన ఆకారానికి స్ఫూర్తి నిచ్చే మానవ మూర్తి(మోడల్) కావాలి.
దేశాటన మొదలు పెట్టాడు.రోజులు వారాలై,నెలలై,సంవత్సరాలు గడిచాయి.
అయినా పట్టు వదలలేదు. తను బయలుదేరిన చోటికి...తన ఊరికి తిరిగి వచ్చాడు.
ఆ రోజు దేవుడు ఆశీర్వదించాడు.
నగర వీధుల్లో అన్యమనస్కం గా నడుస్తున్న అతనికి గాలిలో ఎగిరొచ్చిన బంతి తగిలి కింద పడింది. అప్రయత్నంగానే కిందకి వంగి బంతి చేతిలోకి తీసుకున్నాడు. ఇంతలో...
"ఏయ్! ఇదుగో!...మరేమో, ఆ బంతి నాది. ఇచ్చెయ్యి." అన్నాడు అక్కడికి పరిగెత్తుకొచ్చిన పిల్లవాడు. పది..లేదా పన్నెండేళ్ళ వయసుంటుంది వాడికి.
అలాగేనని తలూపి చిర్నవ్వు తో బంతి అందిచ్చాడు. అందిస్తూ ఆ పిల్లవాడి ముఖం లోకి చూసాడు. బాలుడు కూడా అతనికేసే చిరునవ్వుతో చూసాడు.
అంతే! అతని భ్రుకుటి ముడిపడింది.నమ్మలేని దృశ్యాన్ని చూస్తున్నట్టు గా అతని కళ్ళు పెద్దవయ్యాయి.మస్తిష్కం లో మెరుపులు మెరిసాయి.దేవుడిని ప్రస్తుతించే శ్లోకాలు,సూక్తాలు,స్తోత్రాలు, అన్నింటినీ రంగరించి, ముద్దగా చేసి, ఆ ముద్దకి మానవాకృతి కల్పించి ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో, అలా తనముందు నిలబడి ఉన్న బాలుడిని చూసి చిత్రకారుడి ఒళ్ళు పులకరించింది.
"ఎవరి పిల్లవాడివి నువ్వు? "లేని కోపం నటిస్తూ అడిగాడు."బంతి తో ఎంత గట్టి గా కొట్టావో తెలుసా? మంచి పిల్లలు ఇలా వీధిలో అల్లరి చెయ్యచ్చా?"
బాలుడు బిక్కమొహం వేసాడు."కావాలని బంతి విసరలేదు. తప్పే! బంతి ఇచ్చెయ్యండి."
పిల్లవాడితో ఎంతసేపు మాట్లాడినా అతనికి తనివి తీరటం లేదు."బంతి తిరిగి నీకివ్వాలంటే, ఒక షరతు. నేను చెప్పినట్టు చెయ్యాలి. మరి...చేస్తావా?"అడిగాడు చిత్రకారుడు.అలాగేనని తలూపాడు పిల్లవాడు.
"నువ్వు నాతో పాటు మా ఇంటికి రావాలి.వచ్చాక నేను చెప్పిన చోట కదలకుండా నిల్చోవాలి."
"ఎందుకలా నిల్చోవాలి? కొడతారా?" ఏడుపు ముఖం వేసి అడిగాడు బాలుడు.
"లేదు..లేదు. నిన్ను కొట్టను."దగ్గిరికి తీసుకుని బుగ్గలు నిమురుతూ చెప్పాడు."నువ్వు నేను చాలు అని చెప్పేంతవరకు కదలకుండా నిలబడితే, నేను నీ బొమ్మ కాన్వాసు మీద వేసుకుంటాను. నా పని అయ్యాక,బంతే కాదు... నీకు బోలెడు కానుకలిస్తాను.నువ్వు తిన్నన్నిపళ్ళు,తిను బండారాలు కొని పెడతాను."
"సరే అయితే!వస్తాను."ఒప్పుకున్నాడు బాలుడు.
ఆనందం పట్టలేక ఆ బాలున్ని ఎత్తుకుని తన ఇంటి వైపు దారితీశాడు చంద్ర వర్మ.
అన్వేషణ ముగిసింది.సృష్టికర్త ని కాన్వాస్ మీద సృష్టించే యజ్ఞం మొదలైంది.
బాలుడిని తనకు కావలసిన రీతిలో, భంగిమల్లో చూసుకుంటూ ఉద్వేగాన్ని అణుచుకుంటూపని పూర్తిచేసాడు.పిల్లవాడికి కానుకలు,తినుబండారాలు ఇచ్చి సంతోషపెట్టి పంపించివేసాడు.
మరి కొన్ని రోజులు నిద్రాహారాలు మాని శ్రమించాడు. మామూలుగా తను రూపొందించే చిత్రాల పరిమాణాన్ని మించి ఎన్నో రెట్లు పెద్దగా ఉన్న చిత్రపటాన్ని ఆవిష్కరించాడు. ఎంతయినా భగవంతుని రూపం కదా! కొంచెం దూరం లో నిలబడి ఒక్కసారి స్వహస్తాలతో తీర్చి దిద్దిన భగవత్ స్వరూపాన్ని తనివి తీరా చూసుకున్నాడు. ఆనందం పట్టలేక వెక్కి వెక్కి ఏడ్చాడు.
రాజు గారి అభీష్టం నెరవేరింది.
చిత్రకారుడు రచించిన భగవంతుని చిత్రం ముందు రాజు గారితో పాటు ప్రజలంతా మోకరిల్లారు.చిత్రపటం రాజు గారి పూజా మందిరం లో భద్రపరచబడింది
******
కాలచక్ర భ్రమణం లో కొన్ని సంవత్సరాలు గడిచాయి. దేశం లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని ఆక్రమించుకున్నారు.
రాజు గారు మరణించారు. యువరాజు ని తమ ప్రతినిధి గా బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించి సింహాసనం మీద కూర్చో పెట్టింది.కాలక్రమేణా యువరాజా వారికి పాశ్చ్యాత్య నాగరికత మీద వ్యామోహం పెరిగింది.
రాజు గారు జీవించి ఉన్నంత కాలం చిత్రాలు వేసినా వెయ్యకపోయినా ప్రభుత్వ ఖజానా నుంచి చంద్రవర్మ కు ప్రతి నెలా ధనం అందుతుండేది
కళల పట్ల, కళా కారుల పట్ల ఏమాత్రం గౌరవం లేని యువరాజు ఒక రోజు చిత్రకారుడిని దర్బార్ కి పిలిపించాడు.
"మా పూజా మందిరం లో ఉన్న, భగవంతుని చిత్రాన్ని వేసింది నువ్వేనని విన్నాను.మా తండ్రి గారి కోరిక మేరకే ఆ చిత్రాన్ని వేసావని మాకు తెలుసు.
కాని ఆ తర్వాత మీరు వేసిన చిత్రాలు ఏవీ మా ఆస్థానానికి చేరలేదు. కారణం ఏమిటో మాకు తెలియాలి." చంద్ర వర్మ అన్యమనస్కం గా జవాబిచ్చాడు." తెలీదు మహారాజా!ఒకవేళ కారణం ఉన్నా అదేమిటో నాకు బోధ పడటం లేదు.భగవంతుని చిత్రపటం వేసిన తర్వాత నాలో స్తబ్ధత, శూన్యం ఆవరించింది. తెలీని అశక్తత నన్ను వెంటాడుతోంది. కాన్వాస్ మీద ఏమి వేసినా నాకు అసంపూర్తి గానే కనిపించి...."
"ఇక చాలు! ఆపు!!" గర్జించాడు యువరాజు."ఎవరిక్కావాలి నీ పనికిమాలిన గోడు? కేవలం ఒక చిత్ర పటాన్ని ఆవిష్కరించి మా తండ్రి గారి ఆదరణ పొందావు.
అంతమాత్రాన శేషజీవితమంతా కాలుమీద కాలు వేసుకుని ప్రభుత్వ ఖజానా నుంచి ధనం తీసుకుంటూ గడిపేద్దామని భావిస్తున్నావేమో! అది ఎప్పటికీ కుదరదు. నిష్క్రియా పరులకి నా దర్బార్ లో చోటు లేదు."అని హుంకరించాడు యువరాజు. సింహాసనం పక్కనే కూర్చుని ఉన్న బ్రిటిష్ గవర్నరు యువరాజు కేసి చూసి చిర్నవ్వు తో అన్నాడు."వెల్ సెడ్... యువర్ హైనెస్!"
చిత్రకారుడు నిస్తేజం గా గాజు కళ్ళతో శూన్యం లోకి చూస్తూ నిలబడ్డాడు.
అతడి మౌనం యువరాజు కి మరింత ఆగ్రహం తెప్పించింది.భటుల వైపు చూసి ఏదో సైగ చేయబోయే లోపల బ్రిటిష్ గవర్నరు వారించాడు. ప్రశ్నార్ధకం గా తనవైపు చూసిన యువరాజు ని సమీపించి చెవిలో ఏదో చెప్పాడు ఆ బ్రిటిష్ ప్రతినిధి.
యువరాజు చిత్రకారుడి వైపు చూసి వ్యంగ్యం గా నవ్వి అన్నాడు."సరే!నిన్ను క్షమించి వదిలేస్తాను.చిత్రకారుడివి కదా!అయితే ఓ షరతు. గతం లో భగవంతుడి చిత్రాన్ని వేసి మా తండ్రి గారిని మెప్పించావు. రాజ దర్బారు లో గౌరవం,మన్నన పొందావు."
చిత్రకారుడు వింటున్నాడు."అలాగే, ఇప్పుడు మేము ఆజ్ఞాపించిన విధం గా...నీవు గతం లో వేసిన భగవంతుని చిత్రం కంటే పెద్ద తైల వర్ణ చిత్రాన్ని వేసి తీసుకు రా.ఆ చిత్రం వయో,భాషా,బేధం లేకుండా అందర్నీ అలరించాలి. నన్ను మెప్పించాలి. అప్పుడే నిన్ను ఆస్థానం లో కొనసాగనిస్తాను.నీకు మునుపటిలా సకల గౌరవ మర్యాదలు జరుగుతాయి."
"కృతజ్ఞుడిని యువరాజా!" సభలో మోకరిల్లి చేతులు జోడించి అన్నాడు చిత్రకారుడు."నేను ఏ చిత్రం వేసి తమర్ని ఆనంద పరచాలో ఆజ్ఞాపించండి."
యువరాజు విజయసూచకం గా మందహాసం చేసి బ్రిటిష్ ప్రతినిధి కేసి చూసాడు.
అతడు తలపంకించి "కానీ!"అన్నట్లు గా చెయ్యి ఊపాడు.
యువరాజు చెప్పాడు."నువ్వు భగవంతుడి ని కాన్వాస్ పై సృష్టించి, ఏ చిత్రకారుడు చెయ్యని సాహసం చేసావు. ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధమైన ప్రతిసృష్టి చెయ్యాలి."
చిత్రకారుని కనుబొమలు ముడిపడ్డాయి. యువరాజు కేసి ప్రశ్నార్ధకం గా చూసాడు."దైవానికి విరుద్ధమైనది ఈ జగత్తు లో ఏముంది యువరాజా?"

"ఈ విశ్వం లో ప్రతి విషయమే కాదు...మానవుని మనుగడ కూడా పరస్పర వైరుధ్యాలతో నిండిఉన్న విషయం చిత్రకారుడి వైన నీకు తెలియదా?"వ్యంగ్యం గా అడిగాడు యువరాజు."పగలు-రాత్రి,సుఖ-దుఖాలు,ప్రేమ-ద్వేషాలు, సంతృప్తి-అసంతృప్తి, ఆశ-నిరాశ...ఇవన్నీ పరస్పర వైరుధ్యాలే కదా! అలాగే, భగవంతునికి వ్యతిరేకమైన, విరుద్ధమైన, వ్యతిరేకమైన శక్తినే, సాకారం చేసి,నీ మేధస్సుని,సృజనాత్మకతని పదును పెట్టి, కాన్వాస్ మీద సృష్టించు.అర్ధమైందా!
దైవాన్ని చిత్రం గా వేసిన నువ్వు ఇప్పుడు దయ్యాన్ని చిత్రం వేసి చూపించాలి."

ఉలిక్కిపడ్డాడు చిత్రకారుడు. యువరాజు వంక,గవర్నర్ వంక అయోమయం గా చూడసాగాడు.వారిద్దరూ అతడిని హేళన గా చూసి నవ్వారు.
బ్రిటిష్ గవర్నరు చేతిని దర్బార్ లో వారందరి కేసి ఊపుతూ వ్యంగ్యం గా అన్నాడు."లుక్! హి నోస్ ఓన్లీ ఎబౌట్ గాడ్! నెవెర్ హెర్డ్ అబౌట్ డెవిల్!హ్హ హ్హా హ్హా"
దర్బార్ లో ఆంగ్ల భాష తెలిసిన వాళ్ళు నవ్వారు.. నవ్వకపోతే రాజా వారిక్కోపం వస్తుందేమోనని. వాళ్ళని చూసి ఇంగ్లీషు రానివాళ్ళు కూడా నవ్వారు.
అంతవరకూ నిర్లిప్తత, నిరాసక్తత, శూన్య మస్తిష్కం తో నిస్తేజం గా తలవంచుకుని నిలబడి ఉన్న చిత్రకారుడు నిటారు గా అయ్యాడు. తలెత్తి రాజావారి వంక, గవర్నర్ వంక సూటి గా చూసాడు. అతని కళ్ళల్లో జీవం, ముఖం లో ఆత్మవిశ్వాసం ప్రతి బింబించాయి.
"మీ అభిలాష తప్పకుండా నెరవేరుతుంది మహారాజానేను మీరు చెప్పిన విధం గా దైవత్వానికి, దేవుని శక్తి కి పూర్తి విరుద్ధమైన వ్యతిరేక శక్తి కి అస్తిత్వం కల్పించి కుంచెతో కాన్వాస్ మీద సృష్టించి మీకు సమర్పించుకుంటాను. ఇది నా ప్రతిజ్ణ "
రాజు గారు,బ్రిటిష్ గవర్నరు దేదీప్య మానం గా వెలిగిపోతున్న చిత్రకారుని ముఖం చూసి నోరు తెరుచుకుని ఉండిపోయారు.వారిద్దరికీ తీవ్రమైన ఆశాభంగం కలిగింది. ముందుగా తేరుకున్న రాజా వారు మారుతున్న గవర్నర్ ముఖ కవళికలని చూస్తూ చెప్పాడు."మాటలతో మమ్మల్ని మభ్యపుచ్చటం కాదు. నువ్వు చేయాల్సిన పని ఈ క్షణం నుంచే మొదలైందని తెలుసుకో. నువ్వు విఫలమైన నాడు నీకు శిక్ష తప్పదని గుర్తుంచుకో."
"మహాప్రసాదం. పని ఎప్పుడో మొదలైంది మహారాజా...మీరు నన్ను దర్బారుకు రమ్మని నాకు ఎప్పుడైతే ఆజ్ఞాపించారో, ఆ క్షణం నుంచే భగవంతుడు పని మొదలు పెట్టాడు.నేను కాదు. నేను నిమిత్త మాత్రుణ్ణి."

"
చాలు.ఆపు నీ అహంకారం! కళాకారుల మని విర్రవీగే మీలాంటి వాళ్ళ ని ఎలా కట్టడి చేయాలో నాకు తెలుసు.రోజులు,నెలలు,సంవత్సరాలు కాలం గడిపేసి ఆ తరువాత ఏదో చిత్రాన్ని గీసేసి అదేదో కళాఖండ మని నమ్మించే ప్రయత్నం చేస్తే దానికి తగ్గ ఫలితం అనుభవిస్తావు."
"తెలుసు మహారాజా! కాని మీకా అవకాశంరాదు...రానివ్వను.ఎందుకంటే,భగవంతుని విరాట్ స్వరూపాన్ని అవగాహన చేసుకోవటానికి వేదాలు,రుక్కులు,సూక్తాలు,పురాణాలు, ఉపనిషత్తులను చదివి జీర్ణించుకున్ననాకు ఈసారి అంత శ్రమ పడనక్కర్లేదని తెలిసిపోయింది. నాకిప్పుడు కావాల్సిందల్లా, నేను వేయాల్సిన చిత్రానికి ప్రాణ ప్రతిష్ట చెయ్యటానికి ఖచ్చితం గా సరిపోయే మానవ మూర్తి కావాలి. అంతే!"
"ఓహో!అయితే వేదాలు,పురాణాలు,వగైరాలన్నీ చదివానన్న అహంకారం తో
విర్రవీగుతున్నావన్న మాట!" వ్యంగ్యం గా అన్నాడు బ్రిటిష్ ప్రతినిధి.అతడు ఇంగ్లీష్ లో మాట్లాడినది దుబాసి చిత్రకారుడికి తెలుగులో తర్జుమా చేసి చెపుతున్నాడు.
బ్రిటిష్ ప్రతినిధి తిరిగి హేళనగా అన్నాడు."ఇంకేం..నువ్వు వేయాల్సిన "డెవిల్" చిత్రం కోసం మళ్ళీ వేదాలు,ఉపనిషత్తులు,పురాణాలు,సూక్తులూ మళ్ళీ చదవటం మొదలుపెట్టు."
"మీ సలహాకి కృతజ్ఞుణ్ణిఆ గ్రంధాలన్నీ,దేవుణ్ణి తెలుసుకో టానికే ఉపకరిస్త్తాయి.
ఇకపోతే, దయ్యాన్నిఅదే..మీ భాషలో డెవిల్ ని తెలుసుకోటానికి ఒక్క బైబిల్ ని చదివితే చాలు. వస్తాను." అని వెనక్కు తిరిగి సభ నించి నిష్క్రమించాడు.
చిత్రకారుడు చెప్పిన ది దుబాసి ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసి చెప్పేసరికి, బ్రిటిష్ ప్రతినిధి కి నసాళం అంటి నిలువు గుడ్లు పడ్డాయి. రాజా వారికైతే,ముఖాన కత్తి వాటుకి నెత్తురు చుక్క లేదు. అంతలోనే తేరుకున్న యువరాజు ఆగ్రహం తో చంద్రవర్మ ని బంధించమని సభలో ఉన్న రాజ భటులకి ఆజ్ఞా పించ బోయెం తలో రాజమాత అతన్ని వారించింది.శాంత స్వరం తోకుమారునికి ఇలా చెప్పింది."తొందర పడకండి యువరాజా!చంద్రవర్మ మిమ్మల్ని దిక్కరించినట్టుగా భావించకండి.నిజానికి మీరు,మీ బ్రిటిష్ మిత్రుడు ఇద్దరూ కలిసి అతన్ని, అనితరసాధ్యమైన అతని కళని హేళన చెయ్యబోయి మిమ్మల్ని మీరే అవమానించు కున్నారు. మీరు అతని జీవితానికే సవాలు గా నిలిచే కార్యం ని అప్పగించారు.అతడు విఫలుడైన రోజున ఏ దండన విధించినా సమంజసమే.
ఈ లోపలే ఆవేశపడి ప్రజా వ్యతిరేకతని, పాపాన్ని మూట గట్టు కోవద్దు."
"కాని, అతడు ఒక పౌరుడి గా రాజసభలో క్రమశిక్షణ ని ఉల్లంఘించాడు."బ్రిటిష్ దొర వారు ఉడికిపోతూ చెప్పారు.
"లేదు!" ఖంగుమని మోగింది రాజమాత కంఠం."కళాకారులకి,వారి కళా రూపాలకి, ఎవరైనా తలవంచాల్సిందే!ప్రపంచం లోనే నాగరికులమని చెప్పుకునే మీకు ఈమాత్రం తెలియదా!క్రమశిక్షణ అంటే కనపడిన ప్రతివారినీ క్రమం గా శిక్షిస్తూ పోవటం కాదని తెలుసుకోండి.అంతేకాదు...క్రమశిక్షణ రాజ్యమేలే చోట సృజనాత్మకత కుక్క చావు చస్తుంది."అని చంద్రవర్మ కేసి చూసి మీరిక వెళ్ళొచ్చు అన్నట్టు గా వినయం గా చేతులు జోడించింది రాజమాత.
సభలో హర్షధ్వానాలు మారు మోగాయి.