Sunday, November 15, 2009

do not say you are God fearing...say you are God loving! అడుగడుగున గుడి ఉంది. అందరిలో గుడి ఉంది.


"కెవ్వు" మని గావుకేక పెట్టాడు అనామక రావు. కుంటుకుంటూ నాలుగడుగులు వేసి గట్టు మీద కూలబడి అరిపాదాలు చేత్తో రాసుకుంటూ "అబ్బా, అయ్యో," అంటూ మూలిగాడు. పళ్ళ బిగువున బాధ అణుచుకున్నాడు.
ప్రస్తుతం... అతడు శబరిమలై లో ఉన్నాడు. మిత్రబృందం తో కలిసి అర్ధ రాత్రి రెండో జాము లో , కాళ్ళకి చెప్పులు.. నడుం పైభాగాన ఆచ్చాదన లేకుండా కొండ ఎక్కుతూ ఉన్నాడు. అతడు చేసిన ఆర్తనాదాలు కొండ ఎక్కుతుంటే కాళ్ళలో సూదుల్లాంటి చిన్న గులక రాళ్ళు గుచ్చుకోగా పుట్టిన మంట తాలూకువి.
నెమ్మదిగా మంట తగ్గింది.
అసలు మంట రాజుకుంది. మీమాంస, జిజ్ఞాస తాలూకు మంట.
అంతవరకూ కొండ పైన దట్టంగా పెరిగిన అడవి.. కళ్ళ ముందు పరచిన అద్భుత మైన ప్రకృతిసౌందర్యం తో మమేకమై పోయి నడుస్తున్న వాడు గులక రాళ్ళ దెబ్బతో వర్తమానం లోకి ఊడిపడ్డాడు.
"ఏం, మిత్రమా బ్యాటరీ డౌనైపోయిందా?" వచ్చి పక్కనే కూర్చుని అడిగాడు మిత్రుడైన మరో భక్త శిఖామణి.
టవల్ తో ముఖం తుడుచుకుంటూ చెప్పాడు అనామక రావు."అయ్యప్ప దర్శనం సంగతేమో గాని, ఎండకి వేడెక్కిన బండ రాళ్ళ మీద నడుస్తూంటే..కాళ్ళు కాలినప్పుదల్లా..సూదుల్లాంటి రాళ్ళు గుచ్చుకున్నప్పుడల్లా దేవుళ్ళందరూ కనపడుతున్నారు."
"తప్పు తప్పు. కలలో కూడా అలా అనుకోకూడదు."చెంపలేసుకుంటూ చెప్పాడు మిత్ర భక్తుడు."మన శరీరం ఎంత నొప్పి పెడితే, అవయవాలని ఎంత హింస పెడితే మనకి అంత పుణ్యం వస్తుంది."
"అర్ధం కాలేదు"అయోమయం గా చూసాడు అనామకుడు."ఒళ్ళంతా పచ్చి పుండు అయితే గాని పుణ్యం రాదా?"
"అంతే మరి!" ఖచ్చితం గా చెప్పాడు భక్త మిత్రుడు." నువ్వెన్నిసార్లు కుయ్యో మొర్రో అని ఆర్తనాదాలు చేస్తావో, అదే సంఖ్యలో నువ్వు చేసిన పాపాలు పోతాయి!" గ్యారంటీ ఇచ్చాడు.
"పాపాలు పోయాయి. సరే.. మరి పుణ్యం నా ఖాతాలో ఎప్పుడు క్రెడిట్ అవుతుంది?మళ్ళీ ఇంకోసారి ఈ కొండెక్కి ఒళ్ళూ, కాళ్ళూ పచ్చడి చేసు కుంటే నా?" అంటూ డౌటు పడ్డాడు అనామక రావు.
"ఇంకెక్కడి పుణ్యం? ఇలాంటి ప్రశ్నలు ఆలోచనలే బుర్ర లోకి రాకూడదు రా బాబూ!"చెంపలేసుకుంటూ అన్నాడు మిత్ర శిఖామణి."నీ పాపాల చిట్టా పెంచుకోకు. అయ్యప్పస్వామిదగ్గర నీ ఖాతా ఓవర్ డ్రాఫ్టు ఐపోతుంది జాగ్రత్త! ఒళ్ళు దగ్గిర పెట్టుకో."
ఇద్దరూ బ్యాంక్ ఉద్యోగులవటం చేత వాళ్ళ మాటల్లో బ్యాంక్ భాష ఎక్కువగా దొర్లుతూ ఉంటుంది.
"అది సరే గాని, చెప్పులేసుకుని కొండ ఎందుకు ఎక్కకూడదన్నారో నాకు బోధ పడలేదు." మళ్ళీ సందేహం వెలిబుచ్చాడు అనామక రావు.
"అబ్బా!" అంటూ తల పట్టుకున్నాడు మిత్రుడు."నువ్వు దీక్ష తీసుకోకుండా యాత్రకి వచ్చినందువల్లే నీకు ఇలాంటి దుష్ట ఆలోచనలు వస్తున్నాయి."ఓ నిమిషం ఆలోచించి బదులిచ్చాడు మిత్ర భక్తుడు." అయ్యప్పస్వామినివసించి కొలువై ఉన్న ఈ శబరిమల కొండ మహా పవిత్రమైనది. పాద రక్షలు వేసుకుని ఎక్కటం అంటే కొండని అపవిత్రం చెయ్యటమే! అది చాలా దోషం..మహా పాపం కూడా!" అని ముగించాడు.
ఒక అయిదు నిమిషాలు ఇద్దరూ మౌనంగా కొండ ఎక్కారు.
మిత్రుడు ఆగాడు."కాసేపు అలా గట్టు మీద కూర్చోఇప్పుడే వస్తాను." అన్నాడు.
ఎందుకు ఆగటం అన్నట్టుగా చూసాడు అనామకరావు.
"ప్రకృతి పిలిచింది మిత్రమా?"నవ్వుతూ అన్నాడు మిత్రుడు.పక్కకి తిరిగివెళ్లి చెట్ల గుబురు లో జొరబడ్డాడు. కొద్దిసేపటి తర్వాత తిరిగివచ్చి "వెళ్దాం పద."
ఇద్దరూ మౌనం గా కొండ ఎక్కటం మొదలుపెట్టారు.
"అదిసరే గాని, మిత్రమా! ఇందాక నువ్వు చెప్పులేసుకుని కొండ ఎక్కటం మహాదోషం, కొండ పవిత్రత పాడు చెయ్యటం మహా పాపం అనేకదా చెప్పావు?"
అడిగాడు అనామకరావు..మరోసారి మిత్రుడితో చివాట్లు తినటానికి రెడీ అవుతూ.
"అవును.ఖచ్చితంగా అంతే!"గంట కొట్టినట్టుగా చెప్పాడు మిత్రుడు."కొండని ఎవరు..ఏ విధంగా అపవిత్రం చేసినా..అది మహా పాపం! ఖచ్చితంగా నరకానికి వన్ వే లో వెళ్ళిపోతారు. అది మాత్రం గ్యారంటీ."
"కాళ్ళకి చెప్పులు వేసుకుంటేనే కొండ అపవిత్రం ఇపోతుందని, అలా చెయ్యటం మహాపాపం అని ఘోషిస్తున్నారు కదా.."కొంచెం గట్టిగానే గొణిగాడు అనామకుడు."మరి కొండ ఎక్కిదిగే వాళ్ళందరూ ప్రకృతి పిల్చినప్పుడల్లా కొండ పైనే పని కానిచ్చేస్తున్నారు. పాదరక్షలకే కొండ అపవిత్రం అయితే, మలమూత్రాలతో కొండ అపవిత్రం కాదా? అప్పుడు మీరంతా ఏ నరకానికి వెళతారు?"
మిత్రుడు ఈసారి చెంపలు వాయించుకోలేదు. అనామకరావు అజ్ఞానానికి నిట్టూర్పులూ వదల్లేదు.ఓ నిమిషం పాటు అనామకుడి ముఖం లోకి చూస్తూ నిలబడిపోయాడు.తర్వాత తలవంచుకుని మౌనంగా కొండ ఎక్కటం ప్రారంభించాడు.
అనామకరావు మిత్రుణ్ణి భక్తిగా అనుసరించాడు.








Friday, November 13, 2009

ఒకటి సొంతదైతే, మరొకటి నచ్చిన జోకు.

(అ) ప్రపంచం లో అసలయిన, నిజమైన జోకర్లు ఎవరంటే.... ఎప్పుడూ సీరియస్ గా ఉండే వాళ్ళే!

@@@@...and GOD created woman! (బైబిల్ సూక్తి.) @@@@

(ఆ) ఇటీవల చనిపోయిన రెండు ఆత్మలు స్వర్గ ద్వారం దగ్గిర కలుసుకున్నాయి. ద్వారం తెరవటానికి ఇంకా టైముంది. అంచేత రెండు ఆత్మలూ కబుర్లలో పడ్డాయి.
"అవును గాని, ఇంతకీ నువ్వెలా చనిపోయావ్ గురూ?" యాదాలాపం గా అడిగింది ఓ ఆత్మరెండో ఆత్మని.
"ప్చ్..ఏంచెప్పమంటావ్?" నిట్టూర్చాడు ఆత్మా రావు."అనుకోకుండా అతి శీతలమైన ప్రదేశం లో ఇరుక్కుపోయాను. నిమిషాల్లో పాదం నుంచి తల దాకా గడ్డ కట్టేసి ఐస్ లో శరీరమంతా బిగుసుకు పోయింది. ఆక్సిజన్ లేక మత్తు కమ్మి కళ్లు మూతలు పడ్డాయి. నాకు తెలీకుండానే ప్రాణం పోయింది."
"అంటే సునాయాస మరణమే అన్నమాట! అదృష్టవంతుడివి." అభినందించింది మొదటి ఆత్మ.
"మరి నీ సంగతేమిటి? ఎలా చచ్చావ్?" ఆసక్తి గా అడిగాడు ఆత్మా రావు.
"నాకా అదృష్టం లేదు. నా ఊపిరి ఆగేసరికి చచ్చేంత చావైంది. అదో పెద్ద ట్రాజెడీ." విషాదం గా అన్నాడు ఆత్మలింగం ఉరఫ్ మొదటి ఆత్మ." నా భార్య సరైంది కాదని నాకు తెలిసింది. అది ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుని నాకు దొరక్కుండా చాలా తెలివిగా వ్యవహారం నడుపు కొస్తోంది. ఏమైనా సరే, ఆ రోజు ఆమెని రెడ్ హాన్డెడ్ గా పట్టుకోవాలని ఆఫీసు కెళ్ళి సెలవు పెట్టి సడెన్ గా రహస్యం గా ఇంటికొచ్చా. నా ఖర్మ! ఆ రోజు లిఫ్టు పని చెయ్యలేదు. ఐదో అంతస్థులో ఉన్ననా ఫ్లాట్ కి మెట్ల మీద పరిగెత్తుకెళ్ళి భళ్ళున తలుపు తెరిచాను. ఇంట్లో నా భార్య ఒక్కతే కనపడింది. ఇల్లంతా వెతికినా ఎవరూ కనపడ లేదు.వెంటనే డౌటు వచ్చి కింద ఫ్లోర్ కి పరిగెత్తి అన్ని ఫ్లాట్లూ వెతికా. ఊహూ! ఏం లాభం లేదు. మళ్ళీ కింద ఫ్లోర్ కి. ఆ తర్వాత మరో ఫ్లోర్ కిందకి. ఇలా మొత్తం ఐదంతస్తులూ పైనుంచి కిందకి... కిందనుంచి పైకీ పరిగెత్తి ఓ గంట సేపు వెతుకుతూనే వున్నా.ఎవడూ దొరక లేదు. ఆ డెవిల్ ఏదో మాయ చేసింది. అదేమిటో నాకు తెలిసి చావలేదు. తెలిస్తే చచ్చే వాణ్ని కాదు. ఇంకేముంది? సింపుల్. గంటసేపు ఐదు అంతస్తులూ ఎక్కి దిగేసరికి హార్ట్ ఎటాక్ వచ్చింది." చెప్పటం ముగించాడు ఆత్మలింగం.
ఆత్మా రావు కి దుఖ్ఖం వచ్చింది.ఆ తర్వాత కోపం వచ్చింది.అంతే ! ఆత్మ లింగం ని చావ బాద సాగాడు.
"ఎంత పని చేసావురా, బుర్ర తక్కువ వెధవా! నా కొంప ముంచావు! అయిదంతస్తులూ పరిగెత్తి అంట్ల వెధవ లాగా హార్ట్ ఎటాక్ తెచ్చుకోక పొతే నీ దిక్కు మాలిన కొంపలో ఉన్న ఫ్రిజ్ ని ఎందుకు తెరిచి చూడలేదు? అలా చేసుంటే ఇద్దరం బతికి బట్ట కట్టే వాళ్ళం!"




అయినా నాకెందుకు గానీ... (part-2)

మనకి మన చుట్టూ ఉన్నమనుషుల నుంచి మనం తరచూ వినే కొన్ని మాటలు.
"ఇదుగో, నేను ముందే చెపుతున్నా! నేనసలే సెన్సిటివ్ మనిషిని. నాకు నచ్చని పనులు , నాకు కోపం తెప్పించే పనులు ఎప్పుడూ చెయ్యకండి."
మరో రొటీన్ డైలాగు...
"చూడండి. నేను చాలా ఓపెన్ గా, ఫ్రాంక్ గా మాట్లాడతాను. మనసులో ఏదో పెట్టుకుని పైకి మాత్రం మరేదో మాట్లాడటం నాకు చేతకాదు. అంతేకాదు... నేనసలే స్ట్రిక్టు... స్త్రయిటు ఫార్వర్డూను

మన సమాజం లో చాలా మంది సెన్సిటివ్ నెస్, ఫ్రాంక్ నెస్ మొదలైన పదాలకి తమ తమ మనస్తత్వాలకి అనుకూలం గా ఉండే అర్ధాలు చెప్పుకుంటూ ఎదుటివాళ్ళ చెవుల్లో పూలు పెట్టటానికి ప్రయత్నిస్తుంటారు. కాని.. అది ఎదుటివారిని కాక, వాళ్లు తమని తామే మోసం చేసుకుంటున్నామన్న సంగతి వాళ్ళకి తెలీదు.

సెన్సిటివ్ నెస్ అంటే... ఎవరైనా తను చేసిన పొరపాటు ఎత్తి చూపినా, విమర్శించినా, లేక మందలిస్తేనో...ఎగతాళి చేస్తేనో... విపరీతం గా బాధ పడటం...
తను చదివే నవల్లో నో...చూస్తున్న సినిమా, లేక టీవీ సీరియల్లో.. హీరో లేక హీరోయిను కష్టాలు పడుతుంటే దిండు లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవటం... చేస్తుంటారు. అది చూసిన వాళ్లు " అబ్బో! వీళ్ళు ఎంత సెన్సిటివ్ నో... బాబోయ్!" అని హడిలి చస్తూ ఉంటారు.

కాకపొతే, నిజం వేరు. ఇజం వేరు. అర్ధం వేరు. అపార్ధం వేరు. వచనం వేరు. నిర్వచనం వేరు.
"సున్నిత మనస్తత్వం" కి సైకాలజిస్టులు చెప్పిన అర్ధం వేరు గా ఉంది.
"మనం ఏ పని చేస్తే .... లేక ఏం మాట్లాడితే ... లేదా ఏ నిర్ణయం తీసుకుంటే అది ఎదుటి మనిషిని ప్రత్యక్షం గా నో లేక పరోక్షం గా గాని
శారీరకం గా లేదా మానసికం గా బాధిస్తుందో తెలుసుకో గల ఇంగిత జ్ఞానం (అవేర్ నెస్) కలిగి ఉండటం... ఆ పని చెయ్యకుండా ఉండటం సున్నిత మనస్కులకు పుట్టుక తో వచ్చే సహజమయిన గుణం." అని మానసిక శాస్త్ర వేత్తలు నొక్కి వక్కాణించారు.
కాబట్టి.. అనామకుడి డిస్కవరీ ఏమిటంటే,
" సెన్సిటివ్ నెస్ అంటే నెత్తిమీద నీళ్ళకుండ కాదు. ఎవరైనా గట్టిగా తుమ్మినా, దగ్గినా ఉలిక్కిపడి కళ్ళ నీళ్లు పెట్టుకోవటం కానే కాదు. అయిందానికీ, కానిదానికీ ముక్కు ఎగబీల్చటం...జుట్టు పీక్కోవటం అంతకంటే కాదు.
(దాన్ని emotional black mailing అని మాత్రమే అంటారు.)
.

ఇక పొతే, " so called strict n strait forward" మనుషుల గురించి.
వీళ్ళకి ఆలోచనా శక్తి తక్కువ. కాని " మేం చాలా పర్ ఫెక్టు మనుషులం. తప్పు చేయటం/ మాట్లాడటం మా డిక్షనరీ లోనే లేదు." అన్నట్టు గా ప్రవర్తిస్తుంటారు. కాని, సమయం, సందర్భం లేకుండా మాట్లాడటం.. లేని వ్యక్తుల గురించి వారి పరోక్షం లో అవహేళన చేస్తూ మాట్లాడి అవమానించటమే కాక, ఎదుట ఉన్న వారిని కూడా మాటలతోను, చేతలతోను గాయ పరుస్తుంటారు. ప్రశాంత మైన వాతావరణాన్ని చెడ గొడుతూ ఉంటారు. విచిత్రమేమంటే, వీళ్ళకి ఎదుటివాళ్ళు ..తమ ఉనికి అంటే అసహ్యించుకుంటున్నారన్న వాస్తవాన్ని గ్రహించరు.
మరో చిత్రం ఏమిటంటే తమలాగే మరొకరు frankness ని, strait forward ness ని తమ మీద ప్రయోగిస్తే తట్టుకోలేరు. తల్లడిల్లిపోతారు. నానా యాగీ చేస్తారు. అంతేకాదు తమకి మిగిలిన కొద్దిమంది మిత్రుల్లో కూడా తమ గౌరవాన్ని పోగొట్టుకుంటారు. మానసికం గా బలహీనులైన వీళ్ళు, ఎక్కడైనా ఒకటి రెండు సార్లు ఎదురుదెబ్బతిన్నా, క్రమం గా అవమానం దిగమింగి "క్రింద పడ్డా, మేమే గొప్ప!" అన్నట్టు గా బిల్డప్ లిస్తూ అందరిలో నవ్వుల పాలవుతూ ఉంటారు.










Friday, November 6, 2009

అందానికి అందం నేనే !

అందం...సౌందర్యం...బ్యూటీ...ఖూబ్ సూరత్!మనం బతుకీడుస్తున్న ఈ సమాజం లో మన చుట్టూ ఉన్న, లేదా మనకు తారసపడే వ్యక్తుల్లో రెండు రకాల వాళ్ళున్నారు.

ఒకరు...అందమయిన వాళ్లు. మరోరకం...అందం గా ఉన్నామని అనుకునే వాళ్లు.

నిజం గా చెప్పాలంటే... ప్రపంచం లో ఈ రెండో రకం వాళ్ళే ఎక్కువ. వచ్చే చిక్కంతా వాళ్ళతోనే!

నిజమైన సౌందర్యం అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు. తెలిసిన వాళ్లు చెప్పినా వీళ్ళకి అర్ధం కాదు. అర్ధం అయినా

అంగీకరించరు! ఎందుకంటే....ఇగో అడ్డొస్తుంది.

అంతే కాదు, తమ అంద చందాల మీద తిరుగులేని నమ్మకం తో కాస్మెటిక్స్ మోతాదు మించి వాడటమో, లేక చూడటానికి ఎబ్బెట్టు గా అనిపించేలా దుస్తులు, నగలు ధరించి, తమకి ఉన్న-లేదా తాము ఉన్నదని అనుకుంటున్న అందాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు.
అందం, సౌందర్యం ...ఈ రెండూ ఒకటి కాదు. అందం వేరు.సౌందర్యం వేరు.
కేవలం శరీరాకృతి, ముఖ కవళికల నే అందానికి కొలమానం గా నిర్ణయిస్తే,
దాన్లో మన గొప్పతనం ఏమీ లేదు. మన కనుముక్కు తీరు,శరీరాకృతి ఆకాశం నుంచి ఊడిపడవు.అవి మన తల్లి తండ్రులు మనకి పెట్టే భిక్ష. మన పూర్వీకుల జీన్స్ ప్రభావం. అందం కేవలం శారీరక మైనది.
సౌందర్యం...మానసిక మైనది.మాటలకి అందనిది.
వయసు పెరిగితే, తరిగేది అందం. తరగనిది సౌందర్యం.
బాహ్య స్వరూపాన్ని చూసి అతడు లేక ఆమె అందం గా ఉన్నారని చెప్పవచ్చు.
కాని...ఆ అందానికి, వాక్ సౌందర్యం, గాత్ర సౌందర్యం, ఆత్మసౌందర్యమే కాక, నడక లోను, నడవడిక (బిహేవియర్) లో కూడా అందం జత కలిస్తే నే, ఒక మనిషి లో పరిపూర్ణ మైన సౌందర్యాన్ని చూడగలుగుతాం.
ఇంతకీ ఈ అందాల గొడవ ఎందుకొచ్చిందంటే,
దానిక్కారణం...నోస్టాల్జియా!
జ్ఞాపకాలు రీవైండ్ అయితే ... క్లాసులెగ్గొట్టి చూసిన ఇంగ్లీష్ సినిమాలు గుర్తు వస్తాయి.
ఒక సినిమా పేరు "బ్యూటిఫుల్ పీపుల్ ".
నాకా సినిమా గుర్తు లేదు. సినిమా వాల్ పోస్టర్ మాత్రమేగుర్తుంది.
ఆ వాల్ పోస్టర్ లో ఓ సింహం, ఓ జిరాఫీ, ఓ ఏనుగు, ఇంకా ఓ ఎలుగుబంటి,
కొమ్ముల జింక..ఇంకా ఎన్నో ఎన్నో జంతువులు!

వాల్ పోస్టర్ లో సినిమా టైటిల్ "బ్యూటిఫుల్ పీపుల్" కింద టాగ్..."సమ్ పీపుల్ కాల్ దెమ్ ఎనిమల్స్"

చివరాఖరిగా ......నాకు అంటే ఈ అనామకుడికి తట్టిన ఆలోచన ఏమిటంటే...
సౌందర్యం గానీ.. అందం కానీ.. సృష్టిలో లేదు.
"దృష్టి లో ఉంది."